భారత్లో కరోనా సామాజిక వ్యాప్తికి అవకాశం
ఐసీఎంఆర్ రెండో నివేదిక వెల్లడి
దిల్లీ: భారత్‌లో ఇప్పుడిప్పుడే విజృంభిస్తోన్న కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసర్చ్(ఐసీఎంఆర్) రెండో నివేదిక తేల్చింది. గతకొన్ని వారాలుగా వివిధ రాష్ట్రాల్లోని రోగులపై రాండమ్ శాంప్లింగ్ పరీక్షలు నిర్వహించిన ఐసీఎంఆర్ తాజాగా ఫలితాలను వెల్లడించింది. ఆ నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం మన దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పింది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు దేశవ్యాప్తంగా 5,911 మంది SARI పేషంట్లపై (సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్) ఐసీఎంఆర్ కరోనా పరీక్షలు నిర్వహించింది.అందులో 20 రాష్ట్రాలకు సంబంధించిన 52 జిల్లాల్లో 104 మందికి (1.8శాతం) కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 40 మందికి (39.2 శాతం) విదేశీ ప్రయాణాలతో లేదా విదేశాల నుంచి వచ్చిన వారితో ఎలాంటి సంబంధాలు లేవని తేలడం గమనార్హం. ఈ కేసులన్నీ 15 రాష్ట్రాల్లోని 36 జిల్లాల్లో నమోదయ్యాయి.
> గుజరాత్‌లో 792 SARI పేషంట్లకు కరోనా పరీక్షలు చేయగా 13 మందికి పాజిటివ్ వచ్చింది. (1.6 శాతం).
> తమిళనాడులో 577 SARI పేషంట్లకు గాను 5 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. (0.9శాతం).
> మహారాష్ట్రలో 553 SARI పేషంట్లకు గాను 21 కేసులు పాజిటివ్‌గా తేలాయి. (3.8శాతం).
> కేరళలో 502 SARI పేషంట్లకు గాను 1 పాజిటివ్ కేసు నమోదయ్యింది.(0.2శాతం).
ఈ ఫలితాలను బట్టి కరోనా కట్టడికి ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐసీఎంఆర్ వెల్లడించింది. మార్చి 14 తర్వాత కరోనా పరీక్షల్లో SARI పేషంట్లను జతచేయాలని మార్పులు చేశాక.. మార్చి 15 నుంచి 21 మధ్య 106 కేసుల్లో ఇద్దరు SARI పేషంట్లుగా తేలినట్లు పేర్కొంది. అలాగే మార్చి 22 నుంచి 28 మధ్య 2877 మందికి పరీక్షలు చేయగా 48 మందికి(1.7 శాతం) కరోనా సోకినట్లు నిర్ధారణ అయినట్లు ఐసీఎంఆర్ స్పష్టంచేసింది.
ఇక రెండో నివేదికలో పురుషులే ఎక్కువగా బాధితులవుతున్నారని, అందులోనూ 50 ఏళ్లపైబడిన వాళ్లే అధికంగా ఉంటున్నారని ఐసీఎంఆర్ పేర్కొంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 2 మధ్య కాలంలో SARI పేషంట్లలో 2.6 శాతం పెరుగుల కనిపించినట్లు తెలిపింది. మొత్తంగా ఈ నివేదిక ఏం చెబుతోందంటే.. SARI పేషంట్లలో కరోనా కేసులు నమోదయ్యే జిల్లాలో వైరస్ నియంత్రణ చర్యలు ముమ్మరంగా చేపట్టాలని సూచించింది. అలాగే వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.