Sumitra Divl.PRO:
పత్రికా ప్రకటన ... విశాఖపట్నం, ఏప్రిల్ 10..
కరోనా మహమ్మారిని పారద్రోలడానికి జిల్లా యంత్రాంగం అహర్నిశలు కష్టపడి పని చేస్తున్నాయని ,వాలంటీర్ లు,గ్రామ సెక్రటేరియట్ లు స్థాయినుండి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకూ ప్రాణాంతక వ్యాధి అని తెలిసినప్పటికీ అందరూ కష్టపడి పని చేస్తున్నారని ప్రతి ఒక్కరికి తన ప్రత్యేక ధన్యవాదాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేసుకుంటున్నానని రాజ్యసభ సభ్యులు వి. విజయ సాయి రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక వుడా చిల్డ్రన్ ఎరీనా లో ఏర్పాటుచేసిన కోవి డ్-19 జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దానిని నిర్మూలించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిరోజు సమీక్ష చేస్తూ అనేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర, జిల్లా, నియోజక వర్గాల వారీగా ప్రత్యేక కమిటీలను వేసి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో కోవి డ్ కేసులకు సంబంధించి మొదటి ,రెండవ దశలను దాటి మూడవ దశలో కి రావడం జరిగిందని , ఇది ప్రబలకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికే ఇంటింటికి సర్వే చేపట్టారని, తిరిగి మరల మూడవసారి సర్వే చేపట్టి ప్రతి ఇంటిలోనూ జలుబు ,జ్వరం లాంటి అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారి ఆరోగ్యమే లక్ష్యంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నార న్నారు. ప్రజల ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ప్రస్తుతం కరోనా ను నివారించడానికి మెడిసిన్ ను కనుగొన లేదని, ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ పాటిస్తూ జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. విశాఖలో టెస్టింగ్ కిట్స్, వెంటిలేటర్స్ తయారు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు.
ముఖ్యంగా ప్రజలందరూ గుంపులుగా లేకుండా ,సామాజిక దూరం పాటి స్తు, ఒకరినొకరు సమన్వయంతో ఉండడం ద్వారా కరోనా వ్యాప్తిని నివారించవచ్చు అని అన్నారు. కంటైన్న్మెంట్ ఏరియాలో ఉన్న ప్రజ లు భయాందోళనలతో అభద్రతా భావానికి గురికాకుండా వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా అధికారులకు హితవు పలికారు. కొంతమంది బందోబస్తు సిబ్బంది సంబంధిత ప్రాంత ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని అటువంటి చర్యలు చేపట్ట రాదన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వార్డు లకు సంబంధించి ఏడు కంటైన్ మెంట్ జోన్ లలో 7 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారని వారికి కావలసిన కనీస నిత్యావసరాలు పాలు, కూరగాయలు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అండగా మేమున్నామన్న భరోసా కల్పించాలన్నారు.
హైరిస్క్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యవసర పరిస్థితులలో ఇతర వైద్య అవసరాలకు, బ్యాంకు ఏటీఎంలకు వెళ్లే వారి గుర్తింపు కార్డులను పరిశీలించి అనుమతించాలన్నారు. మెడికల్ షాపులు, ప్రైవేట్ ఆస్పత్రులు నిర్దేశించిన పని వేళ ల వరకు తెరిచి ఉంచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇతర వ్యాధులకు సంబంధించి అత్యవసర వైద్య చికిత్స అందించే విషయంలో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు తప్పనిసరిగా హాజ రై చికిత్స అందించాలన్నారు.
ఆహార పదార్థాలు నిత్యావసరాలకు సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో 60 మిలియన్ టన్నుల ఆహారధాన్యాల నిల్వలు ఉన్నాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పథకం కింద అర్హత ఉండి రేషన్ కార్డు లేనప్పటికీ నిత్యావసరాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మన రాష్ట్రంలో 70 శాతం మంది వ్యవసాయ ఆధారిత రైతులు, రైతు కూలీలు ఉన్నారని ప్రస్తుత పరిస్థితులలో పంట చేతికొచ్చినప్పటికీ పంటను కోయ లేని స్థితిలో ఉన్నారని, వీరిని సామాజిక దూరం పాటించి తన వ్యవసాయ పనులను చేసుకునే విధంగా నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలని అన్నారు. వాణిజ్య పంటలు కందులు , సెనగలు, మొక్కజొన్న , జొన్న కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులను తీసుకుంటామన్నారు.
దారిద్ర్య పు రేఖకు దిగువన ఉన్న దినసరి కూలీలకు జీవితం గడవని పరిస్థితులలో ఉన్నందున ప్రభుత్వ పథకాలను ప్రభుత్వం కల్పిస్తుందని, పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
జిల్లాలో గల 15 నియోజకవర్గ పరిధిలో గల కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు 200 మంది పైగా ఉన్నారని వారందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి నగదు రూపేణా, వస్తు రూపేణా సేకరించి వారి సహాయ సహకారాలను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నగర పోలీస్ కమిషనర్ల కు సూచించారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ కరో నా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తూ అసాధారణమైన పరిస్థితిని కల్పిస్తున్నదని దీనిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సారధ్యంలో జిల్లా యంత్రాంగం 24 /7 బాధ్యతాయుతంగా పని చేస్తున్నారన్నారు. సీఎం గారు ప్రతీరోజు రెండు సార్లు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో, మంత్రులతో సమీక్ష నిర్వహిస్తున్నార
న్నారు. రాష్ట్ర, జిల్లా , నియోజకవర్గ స్థాయి కమిటీలను వేసి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. ఏ ఇంటిని వదలకుండా పక్కాగా సర్వే చేసే విధంగా ఆదేశించారన్నారు. అవసరాలను తీర్చడం తోపాటు క్వారన్టైన్ , షెల్టర్లు లలో ఉన్న వారికి సరయిన ఫెసిలిటీస్ తో పాటు, మంచి నాణ్యమైన ఆహారాన్ని మెనూ ప్రకారం అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఎక్కువగా రెడ్ జోన్ పట్టణ ప్రాంతాల్లో ఉన్నందున, ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులు పడకుండా కనీస నిత్యావసరాలను, త్రాగునీరు, పాలు, కూరగాయలును సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రోటోకాల్ ప్రకారం విధులను నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కరోనా కు సంబంధించి విధులను నిర్వర్తిస్తున్న వైద్యులు, సంబంధిత హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బందితో పాటు, ప్రైవేటు వైద్యులు సిబ్బంది కూడా ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తార న్నారు.
కిడ్నీ, గుండె, క్యాన్సర్ సంబంధిత ఇతర అత్యవసర వైద్య చికిత్స తీసుకునే రోగులకు ప్రత్యేక డాక్టర్ను, హెల్త్ వర్కర్ ను అందుబాటులో ఉంచడం ,అవసరం బట్టి వారికి ప్రాథమిక చికిత్స చేసి మెడిసిన్స్ ఇవ్వాలన్నారు. పరిస్థితి విషమంగా ఉంటే ప్రత్యేక అంబులెన్స్ ల ద్వారా ఆసుపత్రులకు తీసుకు వెళ్లి చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కంటెన్మెంట్ జోన్ లలో నిత్యావసర సరుకుల పంపిణీ ల పూర్తి వివరాలు కు సంబంధించి ఫ్లెక్సీ బ్యానర్ లను ఏర్పాటు చేయడం, అదేవిధంగా పత్రికలలోనూ, రేడియోలు , టీవీలు ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు . పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబరు, కంట్రోల్ రూమ్ నంబర్లను డిస్ప్లే చేయాలన్నారు. మొబైల్ రైతు బజార్లు రెట్టింపు చేయడం డోర్ డెలివరీ చేయడం, పాలు, ఫార్మసీ షాపులు నిరంతరం తెరచి ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. క్వారంటైన్ లో ఉన్న వారికి ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి పౌష్టిక విలువలు కలిగిన నాణ్యమైన ఆహారం, మెనూ ప్రకారం అందించాలన్నారు. స్వచ్ఛంద సంస్థల తయారుచేసిన ఆహారాలను సరఫరా చేయరాదని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా నిరాశ్రయులు, వలస కార్మికులు కొరకు ఏర్పాటు చేసిన షెల్టర్ లలో పదార్థాలను అందజేయాలన్నారు. ఎస్.ఇ.జెడ్ పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న వలస కార్మికులకు వారు వండుకునేదుకు నిత్యావసరాలను పంపిణీ చేయాలన్నారు.
శానిటేషన్ కు సంబంధించి అన్ని పరిసరాలను స్ప్రేయింగ్, బ్లీచింగ్ చేయడం, అవసరాన్ని బట్టి శానిటేషన్ సిబ్బంది ని అదనంగా తీసుకోవాలన్నారు.
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి రేయింబవళ్ళు జిల్లా అధికారులు, సిబ్బంది కష్టపడి పని చేస్తున్నారన్నారు. జిల్లాలో 20 పాజిటివ్ కేసులు వచ్చాయని వారికి మెరుగైన వైద్యం అందించి నలుగురికి డిశ్చార్జి చేయడం జరిగిందన్నారు. మిగిలిన వారు కూడా వారి ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకుని జనజీవనం లోనికి రావాలని ఆశిస్తున్నానన్నారు. కేజీహెచ్లో టెస్టింగ్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని దీనిద్వారా ఒక్కరోజులోనే రిపోర్టు వస్తుందన్నారు. జిల్లా అధికారులు పద్మనాభం మండలం రేవిడి గ్రామాన్ని సందర్శించి అక్కడ పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్యుల తో పాటు వైద్య సహాయం అందించడానికి ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు మరియు సిబ్బంది , ముందుకు రావాలన్నారు. రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలు ధరల నియంత్రణపై విజిలెన్స్ అధికారుల దాడులు చేపట్టి అధిక ధరలకు విక్రయించే వారిపై కేసులు పెట్టాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు నగదు తో పాటు, రేషన్ సరుకుల ను 90 శాతం అందజేయడం జరిగిందన్నారు. స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారవేత్తలు, ప్రజా ప్రతినిధులు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారన్నారు.
జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ లాక్ డౌన్ కచ్చితంగా పాటించడం జరుగుతున్నదని జిల్లా వ్యాప్తంగా 20 పాజిటివ్ కేసులు వచ్చాయని, నలుగురిని డిశ్చార్జి చేయడం జరిగిందన్నారు. అల్లిపురం, పద్మనాభం రేవిడి, ముస్లిం తాటిచెట్లపాలెం ,రైల్వే న్యూ కాలనీ, నర్సీపట్నం, గాజువాక, పూర్ణ మార్కెట్ ప్రాంతాలను కం టైన్మెంటు జోన్లుగా ప్రకటించడం జరిగిందన్నారు. ఆయా ప్రాంతాలకు నిత్యావసర సరుకులను ఇంటింటికీ సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆయా ప్రాంతాలలో శానిటేషన్ చేస్తున్నామన్నారు. కోవి డ్ అనుమానిత కేసులను గుర్తించి వారిని ఐసోలేషన్ వార్డులలో ఉంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 336మందిని క్వారం టై న్ లో ఉంచడం జరిగిందని, 171 మందిి డిశ్చార్జ్ అయ్యారని, వీరందరూ హోమ్ క్వారన్ టైన్ ఉన్నారన్నారనీ వారిని నిరంతర పర్యవేక్షణ లో ఉంచడం జరిగిందన్నారు. ప్రస్తుతం151 మంది క్వారం టైన్ లో చికిత్స పొందుతున్నారన్నారు. వారికి మెనూ ప్రకారం భోజనం అందించడం జరుగుతుందన్నారు. వైద్య సదుపాయం , శాని
టేషన్ సక్రమంగా అమలు జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో ఉడా చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, బీ సత్యవతి, శాసనమండలి సభ్యులు మాధవ్, బుద్ధ నాగ జగదీశ్వరరావు, డిసిసిబి చైర్మన్ సుకుమార్ వర్మ, శాసనసభ్యులు కన్నబాబు రాజు, తిప్పల నాగిరెడ్డి ,గణబాబు ,వెలగపూడి రామకృష్ణ బాబు, గొల్ల బాబురావు ,పెట్ల ఉమాశంకర్ గణేష్ ,అదీప్ రాజ్ , జిల్లా జాయింట్ కలెక్టర్ లు ఎల్ శివశంకర్, వేణుగోపాల్ రెడ్డి, జీవీఎంసీ కమిషనర్ జి సృజన, ఇతర జిల్లా అధికారులు తదితరులు హాజరయ్యారు.
..............................................................
జారీ.. డివిజనల్ పౌరసంబంధాల అధికారి, నర్సీపట్నం.